శివరాత్రి జాగారంలో ఆ నలుగురు

మహాశివరాత్రిని పురస్కరించుకుని సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీ ప్రపంచం శివనామస్మరణలో మునిగి తేలారు. భక్తి .. నియమనిష్ఠలతో పరమశివుని ప్రసన్నం చేసుకునేందుకు పూజలు పునస్కారాలు ఆచరించారు. బిజీ లైఫ్ పర్యవసానం తో ప్రశాంతత అన్నదే కోల్పోయిన ఈ ప్రపంచంలో భక్తి ప్రాశస్త్యాన్ని మరోసారి గుర్తు చేశారు. ఇప్పటికే రామ్ చరణ్ – ఉపాసన జంట 800 ఏళ్ల నాటి పురాతన శివాలయంలో పూజలు ఆచరించిన ఫోటోలు – వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు – బాలీవుడ్ – కోలీవుడ్ సెలబ్రిటీలు శివనామ స్మరణలో భక్తి పూజలతో కనిపించడం ఆసక్తి కలిగించింది. భారతదేశ సనాతన సాంప్రదాయంలో భక్తి ఉద్యమానికి ఉన్న గొప్పతనం ఎన్నో సార్లు బయటపడింది. ముక్తికి మార్గం భక్తి! అని నమ్మే కోట్లాది మంది ప్రజానీకం భారతదేశంలో ఉన్నారు. దేశంలో అన్యమత ప్రచారం ఎంత ఉధృతంగా ఉన్నా భారతీయత దూరం అవ్వకుండా కాపాడగలుగుతోంది భక్తి ఉద్యమం మాత్రమేననడంలో సందేహం లేదు. అందుకే మహాశివరాత్రి ప్రాశస్త్యం మరోసారి సెలబ్రిటీల సాక్షిగా చర్చకు వచ్చింది.
అందాల చందమామ కాజల్- రానా (నేనే రాజు నేనే మంత్రి జోడీ) .. వీళ్లతో పాటే నవాబ్ బ్యూటీ అదితీరావ్ హైదరీ – మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా ఒకేచోట ప్రత్యక్షమై పెద్ద షాకిచ్చారు. వీళ్లందరినీ కలిపిన ఒకే ఒక్క కారణం శివభక్తి. సద్గురు ఆదియోగి శివ విగ్రహం చెంత ఈ బృందం పూజలాచరించింది. ఈ సందర్భంగా దిగిన సెల్ఫీని అభిమానుల కోసం షేర్ చేశారు కాజల్. ఆ నలుగురూ ఎవరికి వారు రకరకాల ప్రాజెక్టులతో బిజీ. శివభక్తి ఇలా ఓచోట కలిపిందన్నమాట. సద్గురు ఆదియోగి శివుడి విగ్రహం ఎత్తు 112 అడుగులు. కోయంబత్తూర్ లో ఈ విగ్రహం ఉంది. ఆ చుట్టుపక్కల పరిసరాల్లో అడవులు విస్తరించి ఉన్నాయని చెబుతారు. దీనిపై అభిమానుల్లో నిరంతరం వేడెక్కించే చర్చ సాగుతుంటుంది.